జైల్లో చంద్రబాబును కలిసిన న్యాయమూర్తి సిద్ధార్థ లూథ్రా

చంద్రబాబు ఉన్న బ్లాక్ ను పరిశీలించిన జైళ్ల శాఖ డీఐజీ

Sidharth Luthra Meet Chandrababu At Rajahmundry Central Jail

అమరావతిః స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన ఏపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడును ఆయన తరఫున వాదనలు వినిపిస్తోన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిద్ధార్థ లూథ్రా రాజమండ్రి కేంద్రకారాగారంలో కలిశారు. చంద్రబాబుతో ములాఖత్ సమయంలో కోర్టులో జరిగిన పరిణామాలను చంద్రబాబుకు ఆయన వివరించారని తెలుస్తోంది. అలాగే, బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ అంశాలపై వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సిద్ధార్థ లూథ్రా సాయంత్రం కేంద్రకారాగారం వద్దకు రాగానే పోలీసులు ఆయన కారును గేటు బయట ఆపేశారు. దీంతో ఆయన కారు దిగి లోపలకు నడుచుకుంటూ వెళ్లారు.

మరోవైపు చంద్రబాబు జైల్లో ఆయన భద్రతపై కుటుంబ సభ్యులు, టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు భద్రత గురించి భువనేశ్వరి కూడా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్ ను జైళ్ల శాఖ డీఐజీ పరిశీలించారు. చంద్రబాబుకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. మరోవైపు జైల్లో చంద్రబాబుకు ఐదుగురు సిబ్బందితో భద్రతను కల్పిస్తున్నారు. ఆయనకు ఒక సహాయకుడిని కూడా నియమించారు.