మోడీ మీకు నేను భయపడతానా – సీఎం రేవంత్

మోడీ గారు మీకు నేను భయపడతానా..? అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలాపూర్‌లో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణకు మోదీ ఏమీ ఇవ్వలేదని చెప్పేందుకు ప్రతి చౌరస్తాలో గాడిద గుడ్డు ఫ్లెక్సీలు పెడదామని పిలుపునిచ్చారు. గాడిద గుడ్డు ఇచ్చిన వారికి ఓటేద్దామా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ ఇచ్చిన వారికి ఓటేయాలన్నారు. నిన్న తన వద్దకు ఢిల్లీ పోలీసులను పంపించి నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు.

మోదీ, అమిత్ షాను గద్దె దించే వరకు కాంగ్రెస్ శ్రేణులు విశ్రమించరన్నారు. కేసీఆర్ గతంలో చెప్పిన దానినే మోదీ ఈరోజు నకలు కొడుతూ తనను తిట్టారన్నారు. తాను ఓబీసీని అని చెప్పుకునే ప్రధాని.. తాము బీసీ గణన చేస్తామంటే ఎందుకు మెచ్చుకోవడం లేదని ప్రశ్నించారు. వయస్సులో, అనుభవంలో మోదీ తన కంటే చాలా పెద్దవారని… తనకు సూచనలు చేయాలి, సలహాలు ఇవ్వాలి కానీ విమర్శలు ఎందుకన్నారు. కానీ ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ఏమిటన్నారు. ఇది గుజరాత్ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి జరుగుతున్న ఎన్నికల యుద్ధమన్నారు.