బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్

మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పులివెందుల నియోజకవర్గం ఇంచార్జ్ బీటెక్ రవికి కడప జిల్లా న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్ విధించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి రెండు రోజుల ముందు జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు.

ఈ సందర్భంగా లోకేశ్‌కు స్వాగతం పలకడానికి పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీటెక్‌ రవి కడప విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో.. పోలీసులకు – రవికి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆయనపై వల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన పది నెలల తర్వాత కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. పోలీసులు ఈ రోజు ఉదయం కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ ను విధించింది. కోర్టు విచారణ అనంతరం బీటెక్ రవిని పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు.