ప్రపంచంలో నాకు అత్యంత ముఖ్యమైన దేశం భారత్‌

President Biden said India is most important country in world to him: US

న్యూఢిల్లీః ప్రపంచంలో తనకు అత్యంత ముఖ్యమైన దేశం భారత దేశమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ విషయాన్ని భారత దేశంలో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి వెల్లడించారు. తనను భారత దేశానికి అమెరికా రాయబారిగా నియమించిన సమయంలో బైడెన్‌ తనతో మాట్లాడుతూ.. తనకు భారత దేశమంటే చాలా ఇష్టమని, ఈ ప్రపంచంలో తనకు అత్యంత ముఖ్యమైన దేశం భారత దేశమేనని చెప్పాడని గార్సెట్టీ గుర్తుచేశారు.

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ భారత్‌ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఎరిక్‌ గార్సెట్టీ ఈ విషయాన్ని గుర్తు చేశారు. చరిత్రలో మరే అమెరికా అధ్యక్షుడు కూడా భారత దేశం తనకు అత్యంత ముఖ్యమైనది అని చెప్పి ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌, అమెరికా దేశాల మధ్య ఎప్పుడైనా స్నేహపూర్వక సంబంధాలే ఉన్నాయన్నారు. అమెరికాలో పన్నులు చెల్లించేవారిలో 6 శాతం మంది ఇండో అమెరికన్‌లే ఉన్నారని చెప్పారు.

రెండు దేశాల మధ్య సాంకేతికత నుంచి వాణిజ్యం వరకు, పర్యావరణం నుంచి మహిళా సాధికారత వరకు, చిరు వ్యాపారాల నుంచి అంతరిక్ష వ్యవహారాల వరకు అన్నింటిలో మంచి సంబంధాలే ఉన్నాయని గార్సెట్టి పేర్కొన్నారు. ప్రపంచాన్ని ముందుకు నడిపించడంలో భారత్‌, అమెరికా దేశాలు రెండు బలీయమైన శక్తులని చెప్పారు.