మా అక్కలతో పోరాడే శక్తిని ప్రజలే ఇస్తారుః అవినాశ్ రెడ్డి

avinash reddy comments on sunitha and sharmila

అమరావతిః కడప లోక్ సభ స్థానం నుంచి మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనపై వైఎస్ షర్మిల, సునీతారెడ్డి చేస్తున్న వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. తన అక్కలు చేస్తున్న ఆరోపణలు ఎంతో బాధిస్తున్నాయని, వారితో పోరాడే శక్తిని తనకు ప్రజలే ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. వారిద్దరూ పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నిరాధార వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నారని అవినాశ్ రెడ్డి విమర్శించారు.

వాచ్ మన్ రంగన్నకు నార్కో టెస్టుపైనా ఎవరూ మాట్లాడలేదు, వివేకాను తానే చంపానని దస్తగిరి చెప్పుకుంటున్నా ఎవరూ మాట్లాడడంలేదు… కానీ 2021 తర్వాత మా అక్కలు ఇద్దరూ చంద్రబాబు కుట్రలో పావులుగా మారారు… రెండున్నరేళ్లుగా మాట్లాడని వారు ఇప్పుడొచ్చి మాట్లాడుతుంటే కోపం కంటే బాధే ఎక్కువగా కలుగుతోందని అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. “మా నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ పని కావాలన్నా చేసి పెట్టే వ్యక్తి… ఆయను జైలుపాల్జేశారు… నేనేమీ తప్పు చేయకపోయినా అన్యాయంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు” అని అవినాశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ప్రజల మద్దతు ఉంది… ఎన్నికల్లో గెలిచేది నేనే… ఇప్పుడు తిడుతున్న వాళ్లు నన్ను క్షమాపణలు అడగాలి… నేను అది వినాలి అని అవినాశ్ వ్యాఖ్యానించారు.