‘అవతార్ 2’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి అవతార్‌ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవతార్‌ సినిమా ఏ రేంజ్‌లో రికార్డులు సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కొత్త లోకంలో విహరింపజేసిన అవతార్‌ సినిమా సీక్వెల్స్‌తో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కనివినీ ఎరుగని వసూళ్లు సాధించింది.

తెలుగులోనూ దాదాపుగా రూ.60 కోట్ల పైచిలుకు కలెక్షన్స్ సాధించింది. తెలుగు నాట అత్యధిక కలెక్షన్స్ సాధించిన డబ్బింగ్ చిత్రంగా దీన్నే చెబుతున్నారు. అలాంటి మూవీ ఓటీటీలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్న తరుణంలో మేకర్స్ ఓటిటి రిలీజ్ ఫిక్స్ చేసి సంతోష పరిచారు.

మార్చి 28న డిజిటల్ స్క్రీన్స్​పై ప్రేక్షకులను అలరించబోతున్నట్లు సోషల్ మీడియాలో మేకర్స్ పోస్ట్ పెట్టారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్స్ అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, వుడు తదితర వాటిల్లో ‘అవతార్ 2’ స్ట్రీమింగ్ కానుంది. 4కే అల్ట్రా హెచ్​డీ, డాల్బీ అట్మాస్ ఆడియోతో మూవీ అందుబాటులోకి రానుంది. తొలుత కొన్ని రోజుల పాటు వీడియో ఆన్ డిమాండ్ లేదా అద్దె ప్రాతిపదికన ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.