అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడి ఉగ్రవాద చర్యే : జైశంకర్‌

Attack on Israel on October 7 a ‘big act of terrorism’, says Jaishankar

న్యూఢిల్లీః ఇటలీలోని రోమ్‌లో విదేశీ వ్యవహారాలు, రక్షణ కమిషన్‌ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య నెలకొన్న యుద్ధంపై ప్రస్తావించారు. ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ 7న జరిగింది ఉగ్రవాద చర్యే అని అన్నారు. ఉగ్రవాదం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు.

“అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడి ఉగ్రవాద చర్యే. ఇది ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు. ఉగ్రవాద చర్య వల్ల ఇప్పుడు ఆ ప్రాంతంలో (ఇజ్రాయెల్‌, గాజా) చాలా భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే చివరికి సంఘర్షణలు సర్వసాధారణం కాకూడదని అందరూ కోరుకోవాలి. ఆ ప్రాంతంలో మళ్లీ స్థిరత్వం ఏర్పడుతుందని ప్రతి ఒక్కరు నమ్మకంతో ఉండాలి. ఇప్పుడు మనం రెండు భిన్నమైన సమస్యలకు పరిష్కారం వెతకాలి. ముందు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. అదే సమయంలో పాలస్తీనా సమస్యలకు పరిష్కారం చూపాలి.

పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఉండాలి. ఈ విషయంలో “టూ స్టేట్స్‌ విధానం” అయితే సరైన పరిష్కారం అని మా అభిప్రాయం. యుద్ధం, ఉగ్రవాదం వల్ల సమస్యలకు పరిష్కారం లభించదు. చర్చలు, సంప్రదింపుల ద్వారానే సమస్యకు పరిష్కారం కనుగొనాలి. ఇందుకు మేం మద్దతిస్తాం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని మేము విశ్వసిస్తున్నాము. చాలా కష్టమైన, సంక్లిష్టమైన పరిస్థితిని పరిష్కరించడంలో ఇది చాలా ముఖ్యమైన భాగం” అని జైశంకర్ అన్నారు.