ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలమైంది. మే 30న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రానుంది. జూన్ 9న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. జూన్ 23న పోలింగ్, 26న ఓట్ల లెక్కింపు ఉండనుంది.

కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు వివిధ రాష్ట్రాలలో ఖాళీ ఏర్పడిన పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆరు రాష్ట్రాల్లో 3 ఎంపీ, 7 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. వాటిలో ఏపీ కూడా ఉంది.

దేశవ్యాప్తంగా ఉప​ ఎన్నిక జరిగే స్థానాలు చూస్తే..

  • ఉత్తర ప్రదేశ్‌: రెండు ఎంపీ స్థానాలు (రాంపూర్‌, అజాంఘర్‌)
  • పంజాబ్‌: ఒక ఎంపీ స్థానం (సంగ్రూర్‌)
  • త్రిపుర: నాలుగు అసెం‍బ్లీ స్థానాలు (అగర్తల, టౌన్‌ బోర్డోవళి, సుర్మా, జుబరాజ్‌నగర్‌)
  • ఆంధ్రప్రదేశ్‌: ఒక అసెంబ్లీ స్థానం (ఆత్మకూరు)
  • ఢిల్లీ: ఒక అసెంబ్లీ స్థానం (రాజిందర్‌ నగర్‌)
  • జార్ఖండ్‌: ఒక అసెం‍బ్లీ స్థానం (మాందార్‌).