నేడు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కెసిఆర్

TS CM Kcr May Day wishes
TS CM Kcr

హైదరాబాద్ : నేడు సీఎం కెసిఆర్ బెంగళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధాని హెచ్​డీ దేవెగౌడతో పాటు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరుతారు. దేవెగౌడ నివాసంలో మధ్యాహ్నం 12.30 గంటలకు భేటీ అవుతారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న విధానం సహా తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో చర్చిస్తారు. దేశంలో ప్రబల మార్పు రావాల్సిన అవసరం ఉందంటున్న కేసీఆర్… అందుకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌.. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, ప్రాంతీయ పార్టీల పాత్ర, తదితర అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఈ ప‌ర్య‌ట‌న‌లో సీఎం కేసీఆర్ వెంట గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సహా కర్నాటక సరిహద్దులోని తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు వెళ్లనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బెంగళూరులో అభిమానులు ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. కేసీఆర్ సాయంత్రం తిరిగి హైదరాబాద్ రానున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/