గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ అహ్మద్‌ సోదరుల హత్య

యూపీలో సంచలనం సృష్టించిన ఉమేశ్‌ పాల్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ , అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ లు హత్యకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం భారీ భద్రత నడుమ ఆస్పత్రికి తీసుకెళ్తోన్న వీరిపై.. జర్నలిస్ట్ ముసుగులో వచ్చిన దుండగులు దగ్గర నుంచి కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్‌లో కాల్పులకు జరపడంతో సోదరులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.

ఈ ఘటనలో ఇద్దరు షూటర్లు సహా ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తులను లవ్‌లేశ్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్య‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్, జర్నలిస్ట్‌కు గాయాలు కాగా.. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పుల అనంతరం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. హత్యలపై విచారణకు ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు.