తెలంగాణలో పెరగనున్న చలి..ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

ఐదు రోజుల అలర్ట్.. పలు జిల్లాల్లో 10 డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రతలు

Cold will increase in Telangana

హైదరాబాద్‌: రాబోయే ఐదు రోజులు తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కొమురంభీం, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, మెదక్, భూపాలపల్లి, నిర్మల్, వరంగల్, మహబూబ్ నగర్, హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతుందని చెప్పారు.

ఈ నెల 12న (ఆదివారం) ఆదిలాబాద్, కొమురంభీం జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 13 సోమవారం నాడు హన్మకొండ, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 14, 15 తేదీలలో ఉమ్మడి ఆదిలాబాద్ లో కనీస ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందన్నారు. ఈ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.