లిక్కర్ స్కామ్‌లో సీబీఐ ముందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

లిక్కర్ స్కామ్‌లో సీబీఐ ముందుకు మరికాసేపట్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ హాజరుకాబోతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న సీఎం కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. కేజ్రీవాల్ వెంట పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ మంత్రులు సహా ఆప్ నేతలు, కార్యకర్తలు భారీగా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ కార్యాలయంవద్ద దాదాపు 1000 మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరిస్తుంచారు. ఆ ప్రాంతాన్ని బారికేడ్లతో దిగ్బంధనం చేసి.. భద్రతను కట్టుదిట్టం చేశారు.

కేజ్రీవాల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ మద్యం కుంభకోణం జరగలేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను కస్టడీలో ఉన్న వ్యక్తులను చిత్రహింసలకు గురిచేసి, కోర్టులో తప్పుడు సాక్ష్యాలను సమర్పించిందన్నారు. మనీష్ సిసోడియా 10 ఫోన్లను ధ్వంసం చేశారని కొద్ది రోజుల క్రితం ఈడీ కోర్టుకు తెలిపింది. ఇప్పుడు ఏజెన్సీ ఒక నివేదికను విడుదల చేసింది. అందులో 5 ఫోన్లను ED స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిందన్నారు. ఇప్పుడు కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చూపించినందుకు ఈడీపై కేసు పెడతానని సీఎం కేజ్రీవాల్ అన్నారు. దేశ ప్రజలకు కొత్త ఆశాకిరణంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించిందని, దీన్ని ప్రధాని, బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నాయని ఆరోపించారు.