కామారెడ్డి లో కేసీఆర్ ఓటుకు రూ.10 వేలు ఇచ్చి గెలవాలని చూస్తున్నాడు – రేవంత్

బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ ఈసారి రెండు చోట్ల నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గజ్వేల్ తో పాటు కామారెడ్డి లలో పోటీ చేస్తున్నాడు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల ఫై అందరి దృష్టి పడింది. కాగా కామారెడ్డి బరిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ సైతం బరిలోకి దిగాడు. దీంతో ఇక్కడ ఎవరు గెలుస్తారనేది దేశ వ్యాప్తంగా చర్చ గా మారింది.

తాజాగా ఈరోజు కామారెడ్డి నియోజకవర్గం భిక్కనూరులో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ కు మళ్లీ ఓటేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లేనని, కేసీఆర్ కాలనాగు వంటి వారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల భూములు మింగేందుకే కేసీఆర్ కామారెడ్డి వచ్చారని, రూ.200 కోట్లు ఖర్చు పెట్టి, రూ.2 వేల కోట్ల భూములను గుంజుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. మన భూములు మన చేతిలో ఉండాలంటే కేసీఆర్ గద్దె దిగాలని చెప్పారు. తెలంగాణను దోచుకున్న దొంగను ఓడించి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ఓటుకు రూ.10 వేలు ఇచ్చి గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కామారెడ్డిలో గల్ఫ్, బీడీ కార్మికులు ఎక్కువగా ఉంటారని, పదేళ్లుగా గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.