అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా దుర్మరణం

అస్సాంలోని లేడి సింగంగా గుర్తింపు తెచ్చుకున్న మహిళా పోలీస్ అధికారు జున్‌మోనీ రాభా(30) మృతి చెందారు. పలు వివాదాల్లో చిక్కుకున్న ఆమె నాగాన్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

మోరికొలాంగ్ పోలీస్ స్టేషన్ ఔట్ పోస్టు ఇంఛార్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్ఐ జున్‌మోనీ రాభా.. సోమవారం అర్ధరాత్రి తన ప్రైవేటు కారులో ప్రయాణిస్తుండగా.. అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న ఓ కంటైనర్ వాహనాన్ని రభా కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు ఆమెను హాస్పటల్ కు తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందిందని డాక్టర్స్ తెలిపారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆమె సివిల్ దూస్తుల్లో ఉందని.. అయితే అర్ధరాత్రి పూట ఒంటరిగా ఎక్కడికి వెళ్లారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని జిల్లా ఎస్పీ తెలిపారు.

జున్‌మోనీ రాభా విధుల్లో కఠినంగా వ్యవహరించే వారు.. తన పనితీరుతో ఆ ప్రాంతంలో ‘లేడీ సింగం’, ‘దబాంగ్‌ పోలీస్‌’గా పేరు , గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ క్రమంలోనే ఆమె పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. అవినీతి ఆరోపణలపై కూడా గతేడాది జూన్‌లో ఆమె అరెస్టయ్యారు. కొంతకాలం పాటు సస్పెన్షన్‌లో ఉన్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో తిరిగి ఆమె విధుల్లో చేరారు.