రేవంత్ రెడ్డికి దాసోజు శ్రవణ్ సవాల్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి బిజెపి నేత దాసోజు శ్రవణ్ సవాల్ విసిరారు. బుధవారం కరీంనగర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, దాసోజు శ్రవణ్ మాట్లాడుకుంటున్న వీడియోను ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి.. ‘‘హైదరాబాద్‌లో మత ఘర్షణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మనసులో మాట వినండి. ఏ కుట్రకు ఈ గుసగుసలు!? వీళ్లా నాయకులు.. ఇలాంటి క్రూర సిద్ధాంతాలు కలిగిన పార్టీని ఏం చేయాలో తెలంగాణ సమాజమే ఆలోచన చేయాలి’’ అని కామెంట్ చేశారు.

దీనికి దాసోజు శ్రవణ్ ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంటూ.. రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేసిన శ్రవణ్.. సోషల్ మీడియాలో అసత్యాలు, అర్ధ సత్యాలతో సొంత పార్టీ నాయకులపై కుట్రలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చిన రేవంత్ రెడ్డి వైఖరి.. కుక్కతోకకు గుండ్రాయి కట్టినా సక్కగ కానట్లు ఉందన్నారు. బండి సంజయ్ ప్రెస్ మీట్ పూర్తి వీడియో (5.20 నిమిషాల నుంచి) చూసైనా సరే.. బట్టకాల్చి మీద వేసే చిల్లర రాజకీయ కుట్రలు మానుకుంటే మంచిదని శ్రవణ్ హితవు పలికారు. తాను మీడియాతో మాట్లాడిన అంశాలు ప్రజల్లోకి వెళ్లాలని బండి సంజయ్ మళ్లీ నాతో చెప్పాడని దాసోజు శ్రవణ్ తెలిపారు.

కేసీఆర్ కుట్ర బహిర్గతం చేస్తే నీకు నొప్పెందుకు? టీఆర్ఎస్‌తో కుమ్మకయ్యావా? అని రేవంత్ రెడ్డిని శ్రవణ్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆయన ప్రచారం చేస్తున్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించాలని సవాల్ చేశారు. రేవంత్ ఆరోపణలు నిజమని తేలితే తాను నమ్మే కనకదుర్గ అమ్మవారి సాక్షిగా జీవితంలో మళ్లీ రాజకీయాల జోలికి రానని శ్రవణ్ స్పష్టం చేశారు. ఒకవేళ నువ్వు చెప్పేది అబద్ధమని తేలితే మూసుకొని కూర్చుంటావా..? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

మొన్నటి వరకు దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ లోనే కొనసాగారు. కానీ రేవంత్ రెడ్డి వైఖరి నచ్చక..కాంగ్రెస్ ను విడి, బిజెపి లో చేరారు.