మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాక్..?

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాక్ ఇచ్చారా..? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్..కాంగ్రెస్ పార్టీ కి , తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపి లో చేరిన సంగతి తెలిసిందే. రాజగోపాల్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే పోలింగ్ డేట్ రావడం, నామినేషన్ల పర్వం మొదలుకావడం మొదలైంది. ప్రస్తుతం అన్ని పార్టీ లు ప్రచారం మొదలుపెట్టి , ఓటర్ల మద్దతు కోరుతున్నాయి. కాగా కాంగ్రెస్ ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నారు.

మొదటి నుండి కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి రాకపోవచ్చని అంత భావించారు. కానీ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ అభ్యర్థి గా నిల్చున్న స్రవంతి నేరుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని కలువడం , ప్రచారానికి రావాలని కోరడం ..ఆయన కూడా వస్తానని చెప్పడం తో కార్య కర్తలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వస్తారు కావొచ్చని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఆయన ప్రచారంలో అడుగుపెట్టలేదు. ఇక ఇప్పుడు ఈ నెల 15న ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారని సమాచారం అందుతుంది. ఇప్పటివరకు మునుగోడులో అడుగుపెట్టని సిట్టింగ్ ఎంపీగా వెంకట్ రెడ్డి నిలిచారు. అంతేకాకుండా మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ తరువాతే హైదరాబాద్ తిరిగి వస్తారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. విదేశీ పర్యటనకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. బైపోల్ ఫలితాల తర్వాత కోమటిరెడ్డి ఇండియాకు వస్తారని సమాచారం. దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

మరోపక్క ఈరోజు మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు మునుగోడులోని తన క్యాంపు కార్యాలయం నుంచి 50 వేల మందితో భారీ ర్యాలీగా చండూరుకు చేరుకుని 11 గంటలకు నామినేషన్‌ దాఖలు చేయబోతున్నారు.