ఏపీలో ‘అసని’ ప్రభావం : నేలకొరిగిన పంట పొలాలు

ఏపీలో ‘అసని’ తూఫాన్ ప్రభావం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ గాలులకు భారీగా చెట్లు నేలకొరిగాయి. దుమ్ముతో కూడిన ఈదురుగాలులు రావటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అరటి, మామిడి తోటలకు పెద్దనష్టం వాటిల్లింది. బొప్పాయి పంట పూర్తిగా నేలమట్టం అయ్యింది. నిజాంపట్నం మండలం బొలగాని వారి పాలెంలో తాడి చెట్టు విరిగి పడి గోపీనాథ్ అనే యువకుడు మృతి చెందాడు. పెటేరు గ్రామంలో రాతి గోడ కూలి… మరో యువకుడు మృతి చెందాడు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం వి.అగ్రహారం గ్రామంలో బలమైన ఈదురు గాలుల ధాటికి 200 వందల వక్కచెట్లు నేలకొరిగాయి. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరారు. అనంతపురం జిల్లా పామిడి మండలం ఎదురూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపడి వ్యక్తి మృతిచెందాడు. అనకాపల్లి జీల్లా నర్సీపట్నంలో రహదారులు జలమయాయ్యాయి.

ఇక అసని గత 6 గంటలుగా గంటకు 14 కిమీ వేగంతో కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను ప్రభావంతో మే 10వ తేదీన ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. మే 11వ తేదీన కూడా ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో ఇదే తరహా వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించింది. మే 12న ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది.