దసరా వేళా ప్రయాణికులకు తీపి కబురు తెలిపిన ఏపీఎస్ఆర్టీసీ

ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ తీపి కబురు తెలిపింది. పెద్ద పండగ వస్తుందంటే చాలు ప్రవైట్ ట్రావెల్స్ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తారనే సంగతి తెలిసిందే. సాధారణ టికెట్ కంటే అధిక మొత్తంలో వసూళ్లు చేస్తూ సొమ్ము చేసుకుంటారు. టీఎస్ఆర్టీసీ , ఏపీఎస్ ఆర్టీసీ లు సైతం 50 శాతం మేర వసూళ్లు చేస్తుంటాయి.

తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ మాత్రం దసరా వేళ అలాంటి అధిక చార్జీలు వసూళ్లు చేయకుండా బస్సులను నడపబోతుంది. ఈ ఏడాది ద‌స‌రా సంద‌ర్భంగా ప్ర‌జ‌ల ర‌వాణా నిమిత్తం 1,081 అద‌న‌పు సర్వీసుల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు సంస్థ ప్ర‌క‌టించింది. ఈ నెల 29 నుంచి వ‌చ్చే నెల 10 దాకా కొన‌సాగ‌నున్న ఈ స్పెష‌ల్ స‌ర్వీసుల్లో సాధార‌ణ చార్జీలే వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించింది. అంతేకాకుండా సోమ‌వారం రాత్రి నుంచే ద‌స‌రా వేళ న‌డ‌ప‌నున్న ప్ర‌త్యేక బ‌స్సుల జాబితాను త‌న అధికారిక వెబ్‌సైట్‌లో విడుద‌ల చేయడంతో పాటుగా వాటిలోనూ రిజ‌ర్వేష‌న్ల‌కు అనుమ‌తి మంజూరు చేసింది.

ద‌స‌రా నేపథ్యంలో ప్ర‌త్యేక బ‌స్సులుగా న‌డ‌వనున్న ఆర్టీసీ స‌ర్వీసులు… విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై.. విజ‌య‌వాడ నుంచి విశాఖ‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, కాకినాడ‌, విజ‌య‌వాడ నుంచి తిరుప‌తి, విజ‌య‌వాడ నుంచి అమ‌లాపురం, భ‌ద్రాచ‌లంల మ‌ధ్య న‌డ‌వ‌నున్నాయి. ఇక టీఎస్ఆర్టీసీ సైతం సుమారు 4 వేల బస్సుల వరకు నడిపేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్‌ బస్సులను నడుపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువైతే.. బస్సుల సంఖ్య పెంచేందుకు కూడా సిద్ధం అవుతోంది.