ఈ నెల 22వ తేదీ వరకు తెలంగాణ లో భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 22 వరకు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఈ అల్పపీడనం వాయువ్యదిశగా ఒడిశా తీరం వైపు కదులుతూ రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

రేపు మంగళవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, సిద్ధిపేట, సంగారెడ్డి, జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే హైదరాబాద్ లోను రేపు వర్షం పడనున్నట్లు తెలిపింది.