చంద్రబాబుకు మహిళా కమిషన్ సమన్లు..

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీనేత బొండా ఉమకు రాష్ట్ర మహిళా కమిషన్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల అత్యాచారం గురైన యువతి చికిత్స పొందుతోంది. బాధిత యువతిని పరామర్శించేందుకు చంద్రబాబు , బోండా ఉమా తో పాటు పలువురు మహిళ తెలుగుదేశం నేతలు వచ్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై చంద్రబాబు , ఉమా అనుచితంగా వ్యవహరించారనే ఆరోపనలు వచ్చాయి. పరామర్శించే సమయంలో వాసిరెడ్డి పద్మకు చంద్రబాబు, బోండా ఉమకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనను వాసిరెడ్డి పద్మ తీవ్రంగా పరిగణించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ హోదాలో నోటీసులు పంపారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార బాధితురాలని పరామర్శించేందుకు వెళ్లిన తన గౌరవానికి భంగం కలిగించే విధంగా చంద్రబాబు ప్రవర్తించారని ఆరోపించారు. తన పట్ల అవమానకర రీతిలో వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఎదుట చంద్రబాబు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. టీడీపీ నేత బోండా ఉమకు కూడా మహిళా కమిషన్ నుంచి ఇవే తరహాలో నోటీసులు అందాయి. ఆయనను కూడా ఈ నెల 27న మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి వ్యక్తిగతంగా రావాలని ఆదేశించారు.