కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ఏపీ టీడీపీ నేతలు

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీ టీడీపీ నేతలు థాంక్స్ తెలిపారు. మొదటి నుండి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తు వస్తున్న కేసీఆర్..ఇప్పుడు విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఫ్యాక్టరీ నిర్వహణకు కావాల్సిన నిధులు ఇచ్చి ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనిపై విశాఖకు వెళ్లి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం పట్ల ఏపీ ప్రజల తో పాటు పలు పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో కేసీఆర్‌కు టీడీపీ నేతలు ధ్యాంక్స్ తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బిడ్డింగులు వేసే అంశానికే తాము వ్యతిరేకమన్నారు. కానీ ప్రైవేటీకరణని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్లు వేస్తామని ముందుకు రావడం సంతోషమని కొనియాడారు. పక్క రాష్ట్ర సీఎం బిడ్లు వేస్తామంటున్నప్పుడు.. ఏపీ సీఎం జగన్ ఏం చేస్తున్నారు..?, సీఎం జగన్ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారా..? అని ఆయన ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం బిడ్లు వేస్తామని ఏపీ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. బిడ్లకే తాము వ్యతిరేకం.. కానీ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఓ ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు.

అలాగే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సైతం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఫై హర్షం వ్యక్తం చేస్తూ..జగన్ ఫై విరుచుకపడ్డారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బిడ్డింగ్ లో తెలంగాణ పాల్గొంటే ఏపీ సీఎం జగన్ కు ఆత్మహత్యే శరణ్యమని కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ బిడ్డింగ్‌లో పాల్గొంటే ఏపీకి అవమానమని , జగన్‌ కు ధైర్యముంటే ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లి ఆపాలని.. లేకుంటే దిగిపోవాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం మూర్ఖంగా, మొండిగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. మోడీ , జగన్ కలిసి ఫ్యాక్టరీని అదానీకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.