కాచిగూడలో వార్డు కార్యాలయం ప్రారంభించిన మంత్రి కెటిఆర్

150 డివిజన్లలో 150 వార్డు కార్యాలయాల ఏర్పాటు

minister-ktr-inaugurates-ward-office-at-kachiguda

హైదరాబాద్‌ః గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రభుత్వం సరికొత్త పాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి వార్డు పాలన వ్యవస్థ అందుబాటులోకి తెచ్చింది. పౌర సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా 150 డివిజిన్లలో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ఇవి శుక్రవారం ప్రారంభమయ్యాయి. కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఈ ఉదయం ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లలో వార్డు కార్యాలయాలను మంత్రులు, మేయర్‌, అధికారులు ప్రారంభిస్తున్నారు. పురపాలనలో మరో సంస్కరణకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని మంత్రి కెటిఆర్ చెప్పారు.

వికేంద్రీకరణ, ప్రజలు కేంద్రంగా పాలనే తమ లక్షమని ఆయన స్పష్టం చేశారు. వార్డు కార్యాలయాల్లోనే కనీస పౌరసేవలు, ఫిర్యాదులు పరిష్కారమవుతాయన్నారు. ప్రతి డివిజన్‌ కార్యాలయంలో 10 మంది అధికారుల బృందం ఉంటుందని, అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ నేతృత్వంలో సమస్యలు పరిష్కారమవుతాయని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. సిటిజన్‌ చార్టర్‌కు అనుగుణంగా ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు.