బీసీలకు సమున్నత స్థానం కల్పించిన నేత జగన్: స్పీకర్ తమ్మినేని

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని సభావేదికపై నుంచి పిలుపునిచ్చిన తమ్మినేని

ap-speaker-tammineni-fires-on-chandrababu-at-jayaho-bc-sabha

విజయవాడః విజయవాడలో జరుగుతున్న జయహో బీసీ సభలో సెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం పాల్గొని మాట్లాడారు. బీసీలకు సమున్నత స్థానం కల్పించి, సమాజంలో తలెత్తుకు జీవించేలా చేసిన ముఖ్యమంత్రి జగన్ కు సభకు హాజరైన అందరి తరఫునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు సీతారం పేర్కొన్నారు. బీసీలను కించపరిచారంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తమ్మినేని మండిపడ్డారు. చరిత్ర తెలియనివాళ్లు బీసీల తోకలు కత్తిరిస్తామంటూ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని సభా వేదికపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

బీసీలు జడ్జిలుగా పనికిరారా.. మేం పనికిరామని లేఖలు రాస్తారా.. మాకు తెలివితేటలు లేవా? అని చంద్రబాబును స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు. దేనికీ కార్పొరేషన్లు, దేనికీ డైరెక్టర్ పదవులు.. ఎందుకు ఇవి నాలుక గీసుకోవడానికా అంటూ హేళన చేస్తున్నారని స్పీకర్ మండిపడ్డారు. ఈ ఆర్డర్లు పేపర్లే కదా అని పొరపాటున నాలుక గీసుకునేవు అచ్చన్నా.. నీ నాలుక పీలికలవుతుందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలలో ఇదే బీసీలు చరిత్ర గతి తిరగరాస్తారని జోస్యం చెప్పారు.

ముసుగు వేసుకొని బీసీ ద్రోహులు మారువేషంలో వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని బీసీలను స్పీకర్ తమ్మినేని అప్రమత్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని తమ్మినేని పిలుపు ఇచ్చారు. బీసీలకు దామాషా పద్ధతిలో రాజ్యాధికారం ప్రసాదించిన మహనీయుడు జగన్ రెడ్డి అని స్పీకర్ చెప్పారు. కార్పొరేషన్ల నుంచి మంత్రిమండలి దాకా.. ఇలా అన్నింట్లోనూ బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించారని జగన్ ను స్పీకర్ తమ్మినేని కొనియాడారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/