మనీలాండరింగ్ కేసు.. మాజీ మంత్రి నవాబ్‌ మాలిక్‌కు ఊరట..!

Nawab Malik’s interim bail extended by 3 months in money laundering case

న్యూఢిల్లీః సుప్రీంకోర్టులో మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌కు ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో మాలిక్ మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మూడు నెలలు పొడిగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. మాలిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆగస్టు 11న రెండు నెలల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. అయితే, చికిత్స తీసుకున్న ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో మరోసారి కోర్టును ఆశ్రయించగా.. జస్టిస్‌ బేలా ఎం త్రివేది, దీపాంకర్‌ దత్తా ధర్మాసనం బెయిల్‌ను పొడిగించింది.

అయితే, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు మధ్యంతర బెయిల్ పొడిగింపును వ్యతిరేకించలేదు. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతో లింకున్న కేసులో ఆయ‌న మ‌నీల్యాండ‌రింగ్‌కు పాల్పడినట్లు ఆరోప‌ణ‌లు ఉండగా.. ఈడీ అరెస్టు చేసింది. మాలిక్‌ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని ఆయన తరఫున న్యాయవాది అమిత్‌ దేశాయ్‌ బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన ఆసుపత్రిలో చేర్పించాల్సి ఉందని తెలిపారు. అయితే, కోర్టు మాజీ మంత్రి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కోర్టు బెయిల్‌ను తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.