ఐఆర్ అంటే వడ్డీలేని రుణం..పీఆర్సీ సాధన సమితి నేతల అసంతృప్తి

పీఆర్సీని కూడా రుణం అంటారేమోనని వ్యంగ్యం

అమరావతి: ఛలో విజయవాడ కార్యక్రమంతో ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణను బలంగా చాటిన నేపథ్యంలో నిన్న ఏపీ సీఎస్ సమీర్ శర్మ పలు వ్యాఖ్యలు చేశారు. ఐఆర్ గురించి ప్రస్తావిస్తూ వడ్డీ లేని రుణం అని అన్నారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ స్పందిస్తూ, ఐఆర్ అంటే వడ్డీ లేని రుణం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇవాళ ఇచ్చిన పీఆర్సీని కూడా రేపు రుణం అంటారేమో అని వ్యంగ్యం ప్రదర్శించారు.

పీఆర్సీ కమిషన్ రిపోర్టు ఇచ్చి తీరాల్సిందేనంటూ ఆయన డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదిక పొందడం తమ హక్కు అని స్పష్టం చేశారు. ఇవాళ్టి పీఆర్సీ సాధన సమితి సమావేశంలోనూ ఇదే తీర్మానం చేశామని చెప్పారు. కనీస వేతనంపై కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ 2018లో నివేదిక ఇచ్చిందని, అయితే పీఆర్సీపై అశుతోష్ మిశ్రా కమిటీ కేంద్ర కమిటీ నివేదికను అనుసరించిందా.. లేదా? అని సూర్యనారాయణ అడిగారు. ఉద్యోగులు 13వ పీఆర్సీలో ఉండాల్సిన సమయంలో 11వ పీఆర్సీలో ఉన్నారని సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు రెండు పీఆర్సీలు కోల్పోయారని వెల్లడించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/