రాజాసింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన సిటీ పోలీసులు

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్‌పై హైద‌రాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్ర‌యించారు. నాంప‌ల్లి కోర్టు రాజాసింగ్ రిమాండ్‌ను తిర‌స్క‌రించ‌డాన్ని పోలీసులు హైకోర్టులో స‌వాలు చేశారు. పోలీసుల రిమాండ్ పిటిష‌న్‌పై రేపు హైకోర్టు విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. ఒక వర్గం వారిని రెచ్చగొట్టారనే ఆరోపణలపై మొన్న ఉదయమే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం హైదరాబాద్ 14వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. రాజాసింగ్ తరపున న్యాయవాది కరుణసాగర్ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రాజాసింగ్ ను అరెస్టు చేశారని.. అరెస్టు సమయంలో 41 సీఆర్పీసీ, సుప్రీంకోర్టు నియమ నిబంధనలను పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ప్రాసిక్యూషన్ న్యాయవాది మాత్రం రాజాసింగ్ ను రిమాండ్ చేయాలని వాదించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయని.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అరెస్టు సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకపోవడంతో కోర్టులో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. రిమాండ్ రిక్వెస్ట్ ను తోసిపుచ్చిన కోర్టు.. కండీషన్ బెయిల్ పై విడుదల చేయాలని ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఆదేశాలపై హైదరాబాద్ పోలీసులు ఈరోజు హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.