సింగర్ మంగ్లీకి ఏపీ మంత్రి రోజా విషెస్

సింగర్ మంగ్లీ కి ఏపీ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) సలహాదారుగా మంగ్లీని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సర్కార్ ఈ బాధ్యతలు అప్పగించిన తరుణంలో మంగ్లీ ఎంతో సంతోషం గా ఉంది. సినీ ప్రముఖులే కాక రాజకీయ నేతలు సైతం మంగ్లీ కి విషెష్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా.. మంగ్లీని ఏపీ మంత్రి రోజా అభినందించారు. ‘తనదైన పాటలతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న #SingerMangli తిరుమల తిరుపతి దేవస్థానం కి చెందిన #SVBC_Channel సలహాదారుగా నియమింపపడటం ఆనందంగా ఉంది. ఇక తన గాత్రంతో స్వామి వారిని స్మరిస్తూ మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నా’ అన్నారు. #GodBlessYou #Mangli అంటూ ట్వీట్ చేశారు. రీసెంట్ గా రోజా బర్త్ డే రోజున ఆమెతో కలిసి మంగ్లీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే రోజా బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా గుత్తి మండలం, బసినేపల్లె తాండకు చెందిన మంగ్లీ.. ప్రస్తుతం టాప్ సింగర్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. బోనాల సాంగ్స్ తో ఎంతో ఫేమస్ అయినా మంగ్లీ..ప్రస్తుతం అన్ని భాషల్లో సాంగ్స్ పాడుతూ అలరిస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్..మంగ్లీకి ఎస్వీబీసీ చానల్ సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల పాటు మంగ్లీ ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా, తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులకు కూడా ఇటీవలే సీఎం జగన్ కీలక పదవులు కట్టబెట్టిన విషయం తెలిసిందే. నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. అలాగే, ప్రముఖ కమెడియన్ ఆలీని ఏపీ ఎలక్ట్రానికి మీడియా సలహాదారు పదవి వరించింది. తాజాగా, మంగ్లీని ఎస్వీబీసీ చానల్ సలహాదారుగా నియమించారు.