గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపుపై కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు..

మంచి రోజులు వచ్చేశాయ్‌ అంటూ ట్వీట్

చమురు సంస్థలు మరోసారి గ్యాస్ సిలిండర్ ధరను పెంచడం ఫై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మంచి రోజులు వచ్చేశాయ్‌.. అందరికి శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్‌ లిండర్‌ ధరను కేంద్రం మరో రూ.50 పెంచేసింది. సిలిండర్‌ ధర పెంచి మహిళలకు ప్రధాని మోదీ కానుకగా ఇచ్చేశారు’ అని ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

గృహావసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌పై రూ.50 పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.1055గా ఉండగా..ఇప్పుడు గ్యాస్‌ సిలిండర్ ధర రూ.1105కు చేరింది. పెంచిన ధరలు ఈరోజు నుండే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. తాజా పెంపుతో ఢిల్లీలో రూ.1003గా ఉన్న సిలిండర్‌ ధర రూ.1053కు చేరింది. సాధారణంగా ప్రతి నెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరను చమురు సంస్థలు రూ.183.50 మేర తగ్గించాయి.

తాజాగా గృహావసరాల గ్యాస్‌ ధర మాత్రం పెంచడం గమనార్హం. ఇప్పటికే నిత్యావసర ధరలు , పెట్రోల్ ధరలు , బస్సు చార్జీలు , కరెంట్ చార్జీలు ఇలా ప్రతిదీ భారీగా పెరిగాయని సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతుండగా..ఇప్పుడు చమురు సంస్థలు గ్యాస్ ధరను సైతం పెంచడం ఫై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజానీకం ఫై ఈ బాదుడు ఏంటి అని ప్రశ్నింస్తున్నారు. ఇలా పెంచుకుంటూ పొతే ఎలా బ్రతకాలని , కుటుంబాన్ని ఎలా పోషించాలని అడుగుతున్నారు.