భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన : ఫారెస్ట్ రేంజర్ ను చంపిన గుత్తికోయలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఫారెస్ట్ రేంజర్ ను గుత్తికోయలు అతి దారుణంగా నరికి చంపారు. చంద్రుగొండ మండలం బెండాల‌పాడు గ్రామ ప‌రిధిలో గుత్తి కోయ‌లు అట‌వీ ప్రాంతంలో చెట్లు న‌రుకుతున్న‌ట్లు సమాచారం అందడంతో రేంజర్ శ్రీనివాసరావు మండల అధికారి సంజీవరావుతో కలసి అడ‌వుల్లో చెట్లు నరుకుతున్న గుత్తి కోయల వ‌ద్ద‌కు వెళ్లారు. చెట్ల‌ను నరకవద్దని గుత్తి కోయ‌ల‌కు అధికారులు ఇద్ద‌రూ సూచించారు. త‌మ‌ను అడ్డుకోవ‌ద్ద‌ని అధికారుల‌ను బెదిరించారు.

అంత‌టితో ఆగ‌కుండా రేంజ‌ర్ శ్రీనివాస‌రావుపై గొడ్డలితో దాడి చేశారు. దీంతో రేంజర్ శ్రీనివాసరావు అక్కడే పడిపోయారు. తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ ప‌డుతున్న శ్రీనివాస‌రావును అట‌వీ సిబ్బంది హుటాహుటిన కొత్త‌గూడెం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అధికారి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో.. మెరుగైన వైద్యం నిమిత్తం ఖ‌మ్మం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.

శ్రీనివాసరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. మరణించిన ఎఫ్ఆర్‭ఓ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‭గ్రేషియాను ప్రకటించారు. దాడిలో మరణించిన శ్రీనివాసరావు డ్యూటీలో వుంటే ఏ విధంగా అయితే.. నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందుతాయో.. అవే నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రిటైర్ మెంట్ వయస్సువరకు వారి కుటుంబ సభ్యులకు ఈ వేతనం అందచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కారుణ్య నియామకం కింద కుటుంబసభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు.