మార్చి 9 నుంచి ఏపీ ఉద్యోగుల తొలి దశ ఉద్యమం

ఏపీలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ఉద్యమానికి సిద్ధమయ్యారు. గత కొద్దీ నెలలుగా ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కనపరుస్తున్న వైఖరి పట్ల ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆదివారం విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న చులకన వైఖరికి నిరసనగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నట్టు వెంకటేశ్వర్లు వెల్లడించారు.

గతంలో తాము 11వ పీఆర్సీని కోల్పోయామని, ఇస్తున్న రాయితీలను కూడా పోగొట్టుకున్నామని, అయినప్పటికీ ప్రభుత్వానికి సహకరిస్తుంటే ఎంతో చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. “మీరు మమ్మల్ని శత్రువులుగా చూడొద్దు… మా బాధ, ఆవేదనను అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలందరికీ తెలియజేస్తున్నాను. రేపు మీలో ఎవరైనా మమ్మల్ని ప్రశ్నించదలచుకుంటే మీ ప్రభుత్వ అధినేతను ప్రశ్నించండి. ఉద్యోగులను ఎందుకు రోడ్ల మీదికి తీసుకువచ్చారని మీరు మీ గౌరవ ముఖ్యమంత్రిని అడగండి. మేం దీనికి బాధ్యులం కానే కాదు. ఉద్యోగ సంఘాల నేతలమైన మమ్మల్ని ఉద్యోగులు ఛీ కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి మేం ఇంకా సహకరించడం న్యాయం కాదు, ధర్మం కాదు. అందుకే ఇవాళ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తున్నాం” అని వెల్లడించారు.