గుజరాత్ లో మరోసారి భూకంపం

ఆదివారం గుజరాత్‌లో భూకంపం సంభవంచింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని అధికారులు వెల్లడించారు. టర్కీ, సిరియా దేశాలను బెంబేలెత్తించిన భూకంపాలు..ఇప్పుడు వరుసగా భారత్‌లోనూ సంభవిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

గుజరాత్ లో ఆదివారం మధ్యాహ్నం 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. రాజ్కోట్ కు 270 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈరోజు మధ్యాహ్నం 3:21 గంటలకు భూకంప కేంద్రం నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది.

గత బుధవారం ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, నేపాల్‌లో కూడా ప్రకంపనలు మరోసారి కనిపించాయి. భూకంప కేంద్రం నేపాల్‌లో గుర్తించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. అయితే ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు చాలా స్వల్పంగానే ఉండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

మరోవైపు ఈ నెల 22న ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో కూడా మధ్యాహ్నం 1.30 గంటలకు భూకంపం సంభవించింది. ఇక్కడ రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. భూకంప కేంద్రం నేపాల్‌లోని జుమ్లాలోని పితోరాఘర్‌కు 143 కిలోమీటర్ల దూరంలో.. భూగర్భంలో 10 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. అంతకుముందు జనవరి 24న నేపాల్‌లో 5.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇలా వరుసగా భారత్ లో భూకంపాలు నమోదు అవుతుండడం తో ప్రజలు ఖంగారు పడుతున్నారు.