పంచాయతీ ఎన్నికల తీర్పు రిజర్వు చేసిన ఏపి హైకోర్టు

టీచర్లు, ఉద్యోగుల ఇంప్లీడ్ పిటిషన్ల కొట్టివేత

అమరావతి: ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగా, ఆ షెడ్యూల్ ను ఏపి హైకోర్టు సింగిల్ బెంచ్ నిలుపుదల చేసింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఏపి హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఎస్ఈసీ దాఖలు చేసిన ఆ పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఇంప్లీడ్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.

నిన్న జరిగిన వాదనలకు కొనసాగింపుగా ఇవాళ కూడా వాదనలు విన్న న్యాయస్థానం… తీర్పును తర్వాత వెల్లడించేందుకు నిర్ణయించింది. మరో మూడ్రోజుల్లోగా ఈ తీర్పు వెలువడే అవకాశముందని హైకోర్టు సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. వాదనల గురించి చెబుతూ…. గతంలో ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పును అప్పీల్ చేసే అధికారం లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదించారని, ఇవాళ ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది అందుకు ప్రతివాదనలు వినిపించారని రాజేంద్రప్రసాద్ వివరించారు.

ఈ కేసులో రిట్ అప్పీల్ చేసే వీలుందని ఎన్నికల సంఘం న్యాయవాది స్పష్టం చేశారని, అందుకు ఆధారాలుగా గతంలో కొన్ని కేసులను ఉటంకించారని తెలిపారు. పైగా ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు చట్టాన్ని అతిక్రమించేదిగా ఉందని, ఎన్నికలు జరపాలని చెప్పడం, జరిపించడం అనేది రాజ్యాంగ విధి అయినప్పుడు ఆ విధిని పాటిస్తున్న ఎన్నికల సంఘానికి అడ్డుతగలడం రాజ్యాంగ వ్యతిరేకం అని ఎస్ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారని రాజేంద్రప్రసాద్ చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/