20కి పైగా కంపెనీలతో ప్రధాని సమావేశం

ఇండియాకు పెట్టుబడులే లక్ష్యంగా..పెట్టుబడి అవకాశాలను వివరించనున్న మోడి

PM Modi
PM Modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి గురువారం రోజు 20కి పైగా దిగ్గజ సంస్థలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇండియాకు మరిన్ని విదేశీ పెట్టుబడులు లక్ష్యంగా ఈ భేటి జరుగనుంది. ఈ సమావేశానికి జపాన్, ఆస్ట్రేలియా, యూరప్, యూఎస్ ఫండ్ కంపెనీలు హాజరు కానుండటంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని మోదీ నిర్వహించనున్నారు. ఇండియాలో పెట్టుబడిదారులకు లభించే అవకాశాల గురించి ఆయన వివరించనున్నారు. సమావేశం అనంతరం మోడి విడివిడిగా ప్రతినిధులతో మాట్లాడతారు.

ఇక ఈ సమావేశానికి ఆస్ట్రేలియన్ సూపర్ అండ్ ఫ్యూచర్ ఫండ్, జపాన్ కు చెందిన పోస్ట్ బ్యాంక్ మరియు ఓంటారియో పెన్షన్ తదితర దిగ్గజ ఫండ్ కంపెనీలు హాజరు కానున్నాయి. కీలకమైన ప్రాజెక్టుల్లో అంతర్జాతీయ ఇన్వెస్టర్లను భాగం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగనుంది. కాగా, నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ పైప్ లైన్ లో భాగంగా, 7 వేల ప్రాజెక్టులను ఇప్పటికే గుర్తించామని, వాటిని గురించి మోడి ప్రస్తావించనున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/