కల్లుగీత కార్మికులకు జగన్ శుభవార్త

ఏపీలో కల్లుగీత కార్మికులకు సీఎం జగన్ శుభవార్త తెలిపారు. కల్లు తీస్తూ ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి మరణించిన, శాశ్వత అంగవైకల్యం బారిన పడే కల్లు గీత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైయస్ఆర్ గీత కార్మిక భరోసా’ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబానికి కూడా రూ.10లక్షలు చొప్పున పరి­హారం ఇవ్వాలని నిర్ణయించింది. చెట్టుపై నుంచి పడి శాశ్వత అంగవైకల్యం బారినపడే కల్లుగీత కార్మికునికి కూడా రూ.10లక్షలు పరిహారం అందజేయనున్నారు. ఇందులో రూ.5 లక్షలు కార్మిక శాఖ, మరో రూ.5లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా రూపంలో అందిస్తాయి.

ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన రాష్ట్ర కల్లుగీత విధానం 2022–2027 ప్రకారం ఈ పరిహారాన్ని ఎక్సైజ్‌ శాఖ ప్రకటించింది. సీఎం జగన్ ప్రకటించిన ‘వైయ‌స్ఆర్‌ గీత కార్మిక భరోసా’ పథకం రాష్ట్రంలోని లక్షలాది మంది గీతకార్మిక కుటుంబాలకు అండగా నిలవనుంది. రాష్ట్రంలో 95,245 కల్లు గీత కుటుంబాలు తమ కులవృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఏటా 1,200 మంది గీత కార్మికులు కల్లు తీస్తూ ప్రమాదానికి గురవుతున్నారు. వారిలో దాదాపు 40శాతం మంది దుర్మరణం చెందుతుండగా మిగిలిన వారు శాశ్వతంగా వైకల్యం బారిన­పడుతున్నారు.