అగ్ని ప్రమాదానికి గురైన డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ షో రూమ్ ను పరిశీలించిన కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ లోని నల్లగుట్ట వద్ద అగ్ని ప్రమాదానికి గురైన డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ షో రూమ్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. గురువారం ఉదయం ఈ షో రూమ్ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలు కావొస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి రాలేదు. ఇంకా మంటలు అక్కడక్కడా కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాద స్థలానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రావడం జరిగింది. ప్రమాదం గురించి అధికారులను , అక్కడి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆదాయం కోసం అక్రమ నిర్మాణాలకు అనుమతివ్వొద్దని ఈ సందర్భాంగా కోరడం జరిగింది. బిల్డింగ్ లోపలికి వెళ్లే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టాలని చెప్పారు. చట్ట వ్యతిరేక గోడౌన్ లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బిల్డింగ్ చుట్టుపక్కల వాళ్లు కూడా నష్టపోయారని… ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలన్నారు. ఇప్పటివరకు జరిగిన అగ్ని ప్రమాదాలకు సంబంధించిన బిల్డింగ్‌లన్నీ అక్రమ కట్టడాలేనని తెలిపారు.

ఐదు ఫ్లోర్లకు మంటలు వ్యాపించడంతో బిల్డింగ్ ఏ క్షణమైనా కుప్పకూలే అవకాశముందని అధికారులు అంటున్నారు. మరోవైపు బిల్డింగ్ లో చిక్కుకుపోయిన వారిలో ఏడుగురిని రెస్క్యూ సిబ్బంది ఇప్పటికే రక్షించారు. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉండిపోయిన మరో ముగ్గురిని బయటకు తీసుకురావడం కష్టంగా మారింది. సహాయక సిబ్బంది ఆ అంతస్థులోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా మంటలు ఎగిసిపడుతుండటంతో సాధ్యం కావడం లేదు.