విజయవాడలో పార్కును తాకట్టు పెట్టిన ప్రభుత్వం

హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో బెర్మ్ పార్క్ తనఖా
తొలివిడతలో రూ.35 కోట్లు విడుదల చేయనున్న బ్యాంకు

విజయవాడ: పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనులతో పాటు హోటళ్లు, రిసార్టలను ఆధునికీకరించేందుకు ఏపీ ప్రభుత్వం మరోసారి అప్పు చేసింది. విజయవాడలోని అత్యంత విలువైన పార్కును తనఖా పెట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకోనుంది. కృష్ణానదీ తీరంలో ఎంతో ఆహ్లాదాన్ని పంచే.. ఆదాయం ఎక్కువగా వస్తున్న, ఆస్తుల పరంగా ఎంతో విలువైన బెర్మ్ పార్క్ ను హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో షూరిటీగా పెట్టి రూ.143 కోట్ల రుణం తీసుకుంటోంది. వాస్తవానికి తొలుత విజయవాడలోని ఇతర ఆస్తులను తనఖా కోసం పరిశీలించినా.. బ్యాంకు వాళ్లు మాత్రం బెర్మ్ పార్క్ నే షూరిటీగా పెట్టాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పార్కును తాకట్టు పెట్టి రుణం పొందుతోంది. తొలి విడతలో భాగంగా బ్యాంకు రూ.35 కోట్లను త్వరలోనే విడుదల చేయనుంది.

మొత్తం 9 ప్రాజెక్టులకు ఇప్పటిదాకా రూ.8.74 కోట్లు ఖర్చు చేశామని, ఆ పనులు పూర్తి కావాలంటే మరో రూ.41.7 కోట్లు అవసరమని బ్యాంకు రుణం కోసం ఏపీటీడీసీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. దాంతో పాటు హోటళ్లు, రిసార్టుల ఆధునికీకరణ పనుల కోసం మరో రూ.55.82 కోట్లు అవసరమని ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. పలు జిల్లాల్లో 2015–16లో ఏపీటీడీసీ ప్రారంభించిన ప్రాజెక్టుల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు మిగతా పనులను పూర్తి చేసేందుకు ససేమిరా అంటుండడంతో.. వారి బిల్లులను చెల్లించి మిగిలిపోయిన పనులను పూర్తి చేయించేందుకు ఈ లోన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాజీవ్ నాలెడ్జ్ వ్యాలీ, గండికోట, కోటప్పకొండ రోప్ వే, బొర్రా గుహలు, లంబసింగి, అహోబిలంలో మౌలిక వసతుల కల్పన వంటి పనులు మధ్యలోనే నిలిచాయి.

కాగా, నదీతీరంలో ఉండడం.. పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం పంచుతుండడంతో బెర్మ్ పార్కుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అక్కడి నుంచి బోట్లలో భవానీ ద్వీపానికి షికార్లకు వెళ్లొస్తుంటారు. ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో ఏపీటీడీసీ ఓ హోటల్ నూ నిర్వహిస్తోంది. కాన్ఫరెన్స్ హాలును పలు మీటింగులు, శుభాకార్యాలకు అద్దెకిస్తుంటారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/