రాజకీయాలను పక్కనపెట్టి దేశం గురించి ఆలోచించాల్సిన తరుణం ఇదిః కమల్‌ హాసన్‌

Kamal Haasan clears air on alliance with INDIA: ‘Time to blur party politics ’

న్యూఢిల్లీః ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్ బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించేవారెవరైనా సరే తమ పార్టీలో భాగమవ్వొచ్చని పేర్కొన్నారు. స్థానిక రాజకీయాలు చేసే వారితో తాము భాగం కాలేమని ఈ సందర్భంగా కమల్‌ హాసన్‌ స్పష్టం చేశారు. పార్టీ రాజకీయాలను పక్కనపెట్టి దేశం గురించి ఆలోచించాల్సిన తరుణం ఇదని ఆయన అన్నారు.

సమావేశంలో భాగంగా ‘ఇండియా’ కూటమిలో చేరుతున్నారా..? అని కమల్‌ హాసన్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన ‘లేదు.. నేను చేరట్లేదు’ అని సమాధానం ఇచ్చారు. అదే సమయంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పొత్తుపై ప్రశ్నించగా.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాధానం ఇచ్చారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళనాడు రాష్ట్రంలో కమల్‌ పార్టీతో అధికార డీఎంకే పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇటీవలే కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ.. పొత్తుపై రెండు రోజుల్లో ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పొత్తుపై ఇవాళ మీడియా ప్రశ్నించగా.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో ఏదైనా శుభవార్త తెలిస్తే మీడియాకు తప్పకుండా చెప్తామని తెలిపారు.