ఏపీలో ముగిసిన పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు సహా 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అయితే.. ఆలోపు క్యూలైన్లలో నిల్చున్న వారికి ఇంకా ఓటు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాల పోలింగ్ కేంద్రాల్లో ఇంకా వందల సంఖ్యలో పోలింగ్ వేసేందుకు లైన్లో ఉన్నారు. వీరంతా ఓటు వేయాలంటే కనీసం రాత్రి పది గంటలు అవుతుందని అధికారులు చెపుతున్నారు.

ఈవీఎం లు నెమ్మదిగా ఉండడంతోనే ఆలస్యం అవుతుందని అంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. కురుపాం వంటి ఇంకొన్ని కేంద్రాల్లో 5 గంటలకు ముగిసింది. అయితే ఈసారి ఎన్నికల సమయంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎక్కువగా పల్నాడు నరసరావుపేట, తెనాలి వంటి ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు జరిగాయి.

ఈసారి ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయం ఉత్కంఠగా మారింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా పోలింగ్ ముగిశాక.. సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సర్వే సంస్థలు వెల్లడిస్తాయి. కానీ లోక్ సభ ఎన్నికలతోపాటు ఏపీలో ఎన్నికలు జరుగుతుండటం.. ఏడు దశల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో ఇది నాలుగో దశ మాత్రమే కావడంతో.. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెలువరించడం ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధం. జూన్ 1 తో అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ పూర్తి అవుతాయి. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ తెలియజేయనున్నారు.