హైదరాబాద్ లో టెన్షన్ : రాజ్‌భవన్‌ ముట్టడికి TSRTC కార్మికుల పిలుపు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం తెలుపకుండా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సైలెంట్ గా ఉండడం పట్ల తెలంగాణ సర్కార్ ఆగ్రహంగా ఉంది. ఇదే క్రమంలో ఆర్టీసీ కార్మికులు సైతం గవర్నర్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు , నిరసనలు తెలుపుతున్నారు. అలాగే ఈరోజు 11 గంటలకు రాజభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు కనుక పెట్టలేకపోతే.. శాసనసభ ఎన్నికలు పూర్తయ్యేవరకు వాయిదా పడినట్టే. వేలమంది జీవితాలతో ముడిపడి ఉన్న బిల్లుకు కీలక సమయంలో రాజ్‌భవన్‌ మోకాలడ్డటంపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహోదగ్రులవుతున్నారు. బిల్లుకు అడ్డుపడితే సహించేదిలేదని హెచ్చరించిన కార్మిక సంఘాలు.. గవర్నర్‌ తీరుకు నిరసనగా నేడు రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం అన్ని డిపోల ఎదుట కార్మికులు ధర్నాలు చేపట్టారు. ఉదయం 6 నుంచి 8గంటల వరకు బస్సులను నిలిపివేసి, తమ నిరసనను తెలియజేశారు.