తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 07 నుండే పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకునేందుకు పోటీ పడ్డారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు.

విజయవాడ రైల్వే కల్యాణ మండపంలోని పోలింగ్‌ కేంద్రంలో సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా ఓటు హక్కు వినియోగించుకున్నారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయవాడ రైల్వే కల్యాణ మండపంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. సీఎం జగన్‌ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైఎస్సార్​ జిల్లా పులివెందుల బాకరాపురం పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కృష్ణా జిల్లా ఉండవల్లిలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పోలింగ్ జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓటర్లకు తన సందేశం ఇచ్చారు. ‘‘మీ భవిష్యత్తును, మీ రాష్ట్ర భవిష్యత్తును ఈరోజు మీరు వేసే ఓటు నిర్ణయిస్తుంది. అందుకే ఇళ్ల నుంచి కదలండి’’ అంటూ ఓటర్లను ఆయన పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజా చైతన్యాన్ని నిరూపించాలని ఓటర్లకు సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.