భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్‌.అంబేద్కర్‌కు సీఎం జగన్ నివాళి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్‌.అంబేద్కర్‌కు ఏపీ సీఎం జగన్ ఘ‌న నివాళుల‌ర్పించారు. అంబేద్కర్‌ జ‌యంతి సంద‌ర్భంగా తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం జ‌గ‌న్‌ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, పామర్రు ఎమ్మెల్యే కైలే అనీల్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్‌ రావు ఉన్నారు.

ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ దేశం గర్విచదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ అంబేద్కర్ అని అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి అని కొనియాడారు. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి అని… వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత అని అన్నారు. భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేమని చెప్పారు. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు వేశామని అన్నారు.