నేడు సిఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ క్యాబినేట్‌ భేటీ

AP Cabinet meeting under the chairmanship of CM Jagan today

అమరావతిః నేడు సిఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ క్యాబినేట్‌ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఏపీ ఎస్‌ఐపీబీ (స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌) ఆమోదించిన భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలపనుంది మంత్రి మండలి. అలాగే విశాఖలో జరిగే ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై క్యాబినేట్‌లో ప్రధానంగా చర్చ జరగనుంది. దీంతో పాటు మోడల్ స్కూల్స్,రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్ళకు పెంచుతూ ఆమోదం తెలపనుంది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తున్న పలు సంక్షేమ పథకాల గైడ్ లైన్స్ లో మార్పులపై తగిన నిర్ణయం తీసుకోనున్నారు. టిడిపి కి సంబంధించి కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. రవాణా శాఖతో పన్నుల పెంపుతో పాటు ఇప్పటికే జీవో లు జారీ అయిన పలు అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. వీటితో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైనా క్యాబినేట్‌ మంత్రి మండలి చర్చించనుంది.

అలాగే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు.. భోగాపురం విమానాశ్రయం, పోర్టుల అభివృద్ధి.. కడప ఉక్కు కర్మాగారం తదితర అంశాలను క్యాబినేట్‌లో చర్చించనున్నట్లు సమాచారం. కాగా విశాఖపట్టణం కేంద్రంగా రాజధాని అంశంపై సీఎం జగన్‌ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ కేంద్రంగా నిర్వహించిన సమావేశంలో జగన్ విశాఖ కేంద్రంగా రాజధాని అని తాను కూడా అక్కడికే వెళ్తున్నానని స్పష్టం చేశారు. దీంతో రాజధాని విశాఖకు షిఫ్టింగ్‌పై కూడా క్యాబినేట్‌లో కీలకంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకా జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్ల పంపిణీపై క్యాబినేట్‌ భేటీలో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది.