రాజ్యసభలో ప్రధాని మోడి భావోద్వేగం

రాజ్యసభలో ముగిసిన నలుగురి పదవీ కాలం..గులాం న‌బీకి సెల్యూట్‌

YouTube video
PM Shri Narendra Modi’s speech in Rajya Sabha during farewell of four members.

న్యూఢిల్లీ: రాజ్య‌స‌భ‌లో ఇవాళ ప్ర‌ధాని మోడి భావోద్వేగానికి గుర‌య్యారు. రాజ్యసభ పదవీ కాలాన్ని ముగించనుకొనున్న నలుగురు సభ్యులకు వీడ్కొలు పలికేందుకు చర్చ జరుగుతున్న సందర్భంగా ప్రధాని మోడి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సభ్యుడు, ఎంతోకాలంగా సభలో ఉన్న గులామ్ నబీ ఆజాద్ గురించి మాట్లాడినంత సేపూ, మోడి భావోద్వేగంతోనే ప్రసంగాన్ని సాగించారు. గులామ్ నబీ సేవలను కొనియాడిన ఆయన, భావితరాలకు ఆయన స్ఫూర్తిమంతుడని అన్నారు. ఓ ఎంపీగా, ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా ఆయన ఇతర ఎంపీలకు, రాబోయే రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తారనడంలో సందేహం లేదని అన్నారు.

ముఖ్యంగా కశ్మీర్ లో ఓసారి ఉగ్రదాడి జరిగిన వేళ, గుజరాత్ వాసులు అక్కడ చిక్కుకుని పోయారని గుర్తు చేసుకున్న మోదీ, ఆ సమయంలో ఆజాద్ తో పాటు ప్రణబ్ ముఖర్జీ గుజరాతీలను కాపాడేందుకు ఎంత శ్రమించారో తనకు తెలుసునని ఉద్వేగంగా మాట్లాడారు. తన సొంత కుటుంబ సభ్యులు చిక్కుకుంటే ఎంత శ్రమిస్తారో, ఆజాద్ అంత శ్రమించారని అన్నారు.

‘నాకు గులామ్ నబీ ఆజాద్ ఎన్నో ఏళ్లుగా తెలుసు. మేమిద్దరం ఒకే సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్నాం. అంతకుముందే ఎన్నో సార్లు కలసుకున్నాం. ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఎంతో ముందుంటారు. ప్రకృతితో మమేకం అవుతుంటారు. ఉద్యానవనాల విషయంలో ఆయనకు చాలా తెలుసు. పదవులు వస్తుంటాయి. అధికారం దక్కుతుంది. కానీ వాటిని ఎలా నిర్వహించాలన్న విషయాన్ని ఎవరైనా ఆజాద్ ను చూసి తెలుసుకోవచ్చు’ అని మోడి వ్యాఖ్యానించారు. ఇక మోడి మాట్లాడుతున్నంత సేపూ పలుమార్లు గులామ్ నబీ ఆజాద్ రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ కనిపించారు.

అంతకుముందు షంశేర్ సింగ్ మన్హాస్ గురించి మాట్లాడిన మోడి, ‘నా ప్రసంగాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నేను ఆయనతో ఎన్నో సంవత్సరాలు పనిచేశాను. మా పార్టీని బలోపేతం చేసేందుకు ఆయనతో కలసి స్కూటర్ పై ప్రయాణించిన రోజులు నాకింకా గుర్తున్నాయి. రాజ్యసభలో ఆయన హాజరు అద్భుతం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు నేను ఆయన సలహాలు తీసుకుంటూ ఉంటాను’ అని చెప్పారు. వారితో పాటు నజీర్ అహ్మద్ లావే, మొహమ్మద్ ఫయాజ్ తదితరుల సేవలనూ కొనియాడారు.