శాసనమండలి రద్దుకు మంత్రివర్గం అమోదం
జగన్ నేతృత్వంలో సమావేశమైన క్యాబినెట్

అమరావతి: ఈరోజు ఉదయం సిఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపి క్యాబినెట్, శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశానికి దాదాపు అందరు మంత్రులూ హాజరుకాగా, నిమిషాల్లోనే ఈ సమావేశం ముగియడం గమనార్హం. మండలి రద్దు అంశాన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ లేవనెత్తగా, కొందరు సీనియర్ మంత్రులు మాత్రం కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. మరో ఏడాదిలో ఎలాగైనా మండలిలో బలం పెరుగుతుందని, పదవులు లేని పార్టీ నేతలకు స్థానం కల్పించవచ్చని, వారు చెప్పగా, అప్పటికే రద్దుపై ఓ నిర్ణయానికి వచ్చేసిన జగన్, బిల్లులను అడ్డుకునే సభలు ఎందుకని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో మండలిలోనూ అనుకూల వాతావరణమే ఉంటుందని వారు భావించినా, పార్టీ అధినేతగా, సీఎంగా జగన్ కు తిరుగులేకపోవడంతో మంత్రులంతా ఆయన నిర్ణయానికి ఆమోదం పలికారు. మరికాసేపట్లో అసెంబ్లీలో మండలి రద్దుపై చర్చ సాగనుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/