ఈ నెల 20 నుంచి తిరుమలలో కొత్త నిర్ణయాలు!

Tirumala Tirupati Laddu Prasadam
Tirumala Tirupati Laddu Prasadam

తిరుపతి: తిరుమలలో ఈ నెల 20 నుంచి కొత్త నిర్ణయాలను అధికారులు అమలు చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునే భక్తులకు ఒక లడ్డూను ఉచితంగా ఇవ్వాలని టీటీడీ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆపై ఎన్ని లడ్డూలు కావాలన్నా ఒక్కొక్కటి రూ. 50 పెట్టి కొనుగోలు చేయాల్సి వుంటుంది. ఈ విషయంలో నిన్న సమావేశమైన టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తిరుమలకు అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల ద్వారా నడిచివచ్చే భక్తులకు మాత్రమే ఒక ఉచిత లడ్డూ ఇస్తున్న టీటీడీ, ఇకపై ప్రతి భక్తుడికీ ఒక లడ్డూను ఇవ్వాలని నిర్ణయించింది. ఆపై లడ్డూలు కావాలంటే మాత్రం రాయితీ లేకుండా కొనుగోలు చేయాలన్న నిర్ణయమే వివాదాస్పదం అవుతోంది. ప్రస్తుతం ప్రత్యేక దర్శనాల సమయంలోనే ఒక్కొక్కరికీ రూ. 25 చొప్పున, రెండు లడ్డూలను ఇస్తున్నారు. ఓ కుటుంబంలో నలుగురు స్వామిని దర్శించుకుంటే, వారికి 8 లడ్డూలతో పాటు, మరో 8 లడ్డూలు తీసుకునే సదుపాయం ఉంది. ఇకపై ఆ సౌలభ్యం లభించబోదు. కుటుంబంలోని నలుగురు, లేదా ఐదుగురు స్వామి దర్శనానికి వెళితే, వారందరికీ ఉచితంగా ఒక్కో లడ్డూ లభిస్తుంది. ఆపై అధికంగా కావాలంటే, అందరూ క్యూ లైన్లలోకి వెళ్లాలా? లేక, ఒకరు వెళ్లి, డబ్బులు కట్టి, లడ్డూలు తెచ్చుకోవచ్చా? అన్న విషయమై స్పష్టత లేకపోవడం భక్తులను అయోమయానికి గురి చేస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/