ఏపీ టెన్త్ పరీక్షల లీక్ : 22 మంది ఉపాధ్యాయులు సస్పెండ్

ఏపీలో పదో తరగతి పరీక్షలు రీసెంట్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రారంభమైన మొదటి రోజు నుండే ప్రశ్న పత్రాలు లీక్ కావడం సంచలనం రేపింది. వరుసగా నాల్గు రోజుల పాటు ప్రశ్న పత్రాలు లీక్ కావడం తో విద్యార్థుల్లో , తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ అయ్యింది. ఘటనకు పాల్పడిన ఉపాధ్యాయులఫై కేసులు నమోదు చేయడం , రిమాండ్ కు తరలించడం చేసారు.

ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో 22 మంది ఉపాధ్యాయులను విద్యాశాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్ చేశారు. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె జడ్పి స్కూల్ లో తెలుగు పరీక్ష మాల్ ప్రాక్టిస్‌కు పాల్పడిన 22 మంది ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేస్తున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ప్రశ్నపత్రాన్ని సెల్ ఫోన్ లో బయటకు పంపిన ఇద్దరు సిఆర్పిలు, 10 మంది ఉపాధ్యాయులు, 9 మంది ఇన్విజిలేటర్ల పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. మరోపక్క ప్రశ్న పత్రాల లీక్ పట్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఫై విమర్శలు చేసింది. దీనిపట్ల బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి బొత్స తన పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేసింది.