తిరుమలలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం..

తిరుమలలో కిడ్నాప్ కు గురైన బాలుడి ఆచూకీ లభించింది. మూడు రోజులక్రితం తిరుమలలో ఐదేండ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. కడపకు చెందిన దంపతులు తిరుపతికి వచ్చి స్థిరపడ్డారు. తిరుమల కొండపై పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త స్థానికంగా పని చేసుకుంటుండగా.. భార్య తిరుమల కొండపై తిరునామాలు పెడుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం తల్లి భక్తులు నామాలు పెడుతూ..తమ పిల్లాడిని పక్కన కూర్చోబెట్టింది. అయితే, శ్రీవారి ఆలయం ఎదురుగా కూర్చొని ఉన్న బాలుడిని మహిళ కిడ్నాప్‌ చేసింది.

బాలుడు కనిపించకపోయేసరికి పోలీసులకు పిర్యాదు చేయగా..పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ చేసిన మహిళ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో కిడ్నాప్‌ చేసిన మహిళే మరోసారి బాలుడిని తిరుమలకు తీసుకురావడంతో పోలీసులు పట్టుకున్నారు. కాగా, కిడ్నాప్‌ చేసిన మహిళను కర్నాటకకు చెందిన పవిత్రగా పోలీసులు గుర్తించారు. గోవర్దన్‌ను మొదట తిరుమల కమాండ్‌ కంట్రోల్ రూమ్‌కు తరలించి అనంతరం పోలీసులు అతడి తల్లిదండ్రులకు అప్పగించడంతో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. మరోవైపు.. కిడ్నాపర్‌ పవిత్రపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు తెలిపారు.