తిమ్మాపూర్ ఆలయానికి మరో రూ.7 కోట్లు మంజూరు : సిఎం కెసిఆర్‌

తిమ్మాపూర్‌ వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న సిఎం కెసిఆర్‌ దంపతులు

another-rs-7-crore-sanctioned-for-thimmapur-temple-cm-kcr

బాన్సువాడః కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సిఎం కెసిఆర్‌ దంపతులు పాల్గొన్నారు. అక్కడ ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. ఆ తర్వాత సిఎం కెసిఆర్‌ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం సతీమణి శోభ.. దాతల సహకారంతో స్వామివారి కోసం తయారు చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని సిఎం కెసిఆర్‌ చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు. అనంతరం సీఎం దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో సీఎం దంపతుల వెంట స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్‌, బీబీ పాటిల్‌, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. కాగా, అంతకుముందు బాన్సువాడకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనస్వాగతం పలికారు.

అనంతంరం తిమ్మాపూర్ లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో పాల్గొన్న సీఎం… సమైక్య పాలనలో సాగు నీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. సింగూరు నీటి కోసం రైతులు ఉద్యమించారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి నిజాంసాగర్ కూడా ఒక భాగమేనన్న ఆయన.. బాన్సువాడ ప్రాంతంలో గతంలో అనేక ఇబ్బందులు ఉండగా ప్రస్తుతం రూ.1500 కోట్ల వరి పంట సాగవుతోందని తెలిపారు. బాన్సువాడ ప్రజలకు భవిష్యత్ లో స్పీకర్ పోచారం సేవలు అవసరమని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. దాంతో పాటు నియోజకవర్గానికి రూ.50 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్టు సీఎం స్పష్టం చేశారు.