ఇంటర్ బోర్డు ఎదుట ఎస్ఎఫ్ఐ సభ్యులు ఆందోళన

ఇంటర్ బోర్డు ఎదుట ఎస్ఎఫ్ఐ సభ్యులు ఆందోళన చేపట్టారు. గత వారం రోజులుగా వరుసపెట్టి విద్యార్థులు ఆత్మ హత్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ప్రీతీ , రక్షిత, దాసరి హర్ష తాజాగా సాత్విక్‌ లు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరు సీనియర్స్ వేదింపులు తట్టుకోలేక మరణిస్తే..మరొకరు ప్రేమ వేదింపులు తట్టుకోలేక మరణించారు. ఇక ఇప్పుడు సాత్విక్‌ ..కాలేజీ యాజమాన్యం ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటన నార్సింగి శ్రీ చైతన్య కళాశాలలో చోటుచేసుకుంది. శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థి ఎన్‌. సాత్విక్‌ తరగతి గదిలోనే మంగళవారం రాత్రి 10.30 సమయంలో ఉరి వేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వల్లే సాత్విక్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు , బంధువులు పలు విద్యార్థులు కాలేజీ గెట్ దగ్గర , నాంపల్లి ఇంటర్ బోర్డు ముందు ఆందోళన చేపట్టారు.

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాత్విక్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని కోరారు. సాత్విక్ కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇంటర్ బోర్డు కార్యాలయం గేటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆందోళకారులను అడ్డుకున్న పోలీసులు…. అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోపక్క సాత్విక్ సూసైడ్ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం ఫ్యాకల్టీ ఆచార్య, కృష్ణారెడ్డి, వార్డెన్ నరేష్ పై కేసులు నమోదు చేశామని ఏసీపీ రమణ గౌడ్ చెప్పారు. గతంలో కొంతమంది సిబ్బంది స్టూడెంట్స్ ను క్లాస్ రూమ్ లోనే కొట్టిన వీడియోలపైనా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.