భారతీయుడిని కాల్చి చంపిన ఆస్ట్రేలియా పోలీసులు

Indian national stabs cleaner at rail station in Sydney, shot dead by Australian police

కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో ఓ భారతీయుడిని అక్కడి పోలీసులు కాల్చి చంపారు. తమిళనాడుకు చెందిన మహమ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్(32).. బ్రిడ్జింగ్‌ వీసాపై ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. మహమ్మద్‌.. సిడ్నీ రైల్వే స్టేషన్‌లో ఓ క్లీనర్‌ను కత్తితో పొడిచాడు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి అక్కడి కానిస్టేబుళ్లతో గొడవకు దిగాడు. దీంతో ఆగ్రహించిన పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రహమతుల్లా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ న్యూస్ పేపర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సిడ్నీ ఆబర్న్ స్టేషన్‌లో అహ్మద్ ఓ క్లీనర్ (28)పై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత ఆబర్న్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ కానిస్టేబుళ్లతో గొడవకు దిగాడు. ఆపై దాడికి యత్నించాడు. దీంతో పోలీస్ అధికారి అహ్మద్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అందులో రెండు అహ్మద్ ఛాతీలోకి దూసుకెళ్లాయి. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని విచారం వ్యక్తం చేసింది. విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగంతోపాటు పోలీసు అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని తెలిపింది.